భాష
ఒక భాషలో క్రొత్త పదాలు చేరడం వల్ల, ఆ భాష అభివృద్ది చెందుతుంది. ఇలా జరగడం ఆ భాషకు ఎంతో మంచిది. కానీ, ఆ కొత్తగా చెరే పదాలేవో ఉన్న భాష నుంచే ఉత్పత్తి చెందితే మంచిది. వెరే భాష నుంచి పదాలను మార్చకుండా అలాగే వాడడం వల్ల, ఉన్న భాషలో కొత్త పదాలు పుట్టించే శక్తి తగ్గిపోతుంది. బాధ కలిగించే విషయం ఏంటంటే, తెలుగులో సొంత పదాలు ఉన్న చోట కూడా వేరే భాష పదాలు వాడడం వల్ల, ఇప్పుడు తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత.
వాడుకా ? తెలుగా ?
తెలుగు భాష నేర్పించాలన్నా, నేర్చుకోవాలన్నా ఎదురయ్యే మొదటి సమస్య ఇది. వాడుక కావాలంటే తెలుగు వదిలెయ్యాలి. తెలుగు కావాలంటే వాడుక వదిలెయ్యాలి. అయితే ఎన్నో ఏళ్ళగా తెలుగులో ఉండిపోయిన పదాల వల్ల, తెలుగో కాదో చెప్పలేనంతగా వేరే భాష పదాలు కలిసిపోయాయి. ఇప్పుడు ఈ వాడుక భాషా పదాలు వదిలెయ్యడం చెప్పినంత తేలిక పని అయితే కాదు.
మేలిమి తెలుగు పదాలు అని చెప్పడానికి మేము ఎన్నుకొన్న వరుసక్రమం -
- వాడుకలో ఉన్న తెలుగు పదాలను ఎప్పుడూ మొదట వాడాలి.
- కొన్నిసార్లు తెలుగు పదాలు ఉన్నప్పటికీ, పరాయిభాష నుంచి పుట్టించిన తెలుగు పదాలు వాడుకలో ఉంటాయి. వీటినే వికృతి అని కూడా పిలుస్తారు. ఇలాంటప్పుడు తెలుగు పదాలు వ్రాసి పక్కనే బ్రాకెట్‌లో వాడుకలో ఉన్న వికృతి పదం రాయాలి. మచ్చుకు: మాపు (రేయి)
- ఇంకొన్నిసార్లు తెలుగు పదాలు ఉన్నప్పటికీ, పరాయిభాష నుంచి పదాలు నేరుగా వాడుకలో ఉంటాయి. ఇలాంటప్పుడు తెలుగు పదాలు వ్రాసి పక్కనే బ్రాకెట్‌లో వాడుకలో ఉన్న వేరే భాషా పదం రాయాలి. మచ్చుకు: కారు (ఋతువు)
- తెలుగు పదమే లేని చోట, స.వెం. రమేశ్, వాచస్పతి లాంటివారు పుట్టిస్తున్న తెలుగు పదాలు రాసి, పక్కనే బ్రాకెట్‌లో వాడుకలో ఉన్న వేరే భాషా పదం రాయాలి. అయితే ఇక్కడ ఆ కొత్తం పదం మూలం, ఉత్పత్తి మనకు తెలిసి ఉంటేనే వాడాలి.
- ఇవేవీ కుదరని చోట వాడుకలో ఉన్న వెరే భషా పదాలు పలుకులు అలాగే రాయాలి.
ఇలా చేయడం వల్ల మేలు ఏంటంటే, వాడుక తెలుగు నుంచి, తెలుగు వాడుక చేయడం వైపు అడుగులు వేస్తాం.
సాహిత్యం
తెలుగు సాహిత్యంలో మొదటి నుంచి, సంస్కృతమే సింహభాగం, తెలుగు పాళ్లు తక్కువే. అలా అని నిరుత్సాహపడనవసరం లేదు.
పొనగంటి తెలగన్న, పాల్కురికి సోమనాధుడు, కూచిమంచి తిమ్మకవి లాంటి కవులు పూర్తీగా తెలుగులోనే రచన సాగించారు. తెలుగు శతకాల్లో వేమన శతకం, సుమతీ శతకాల్లో తెలుగుకు చక్కని స్థానమే దొరికింది. తిక్కన, పోతన లాంటి కవులు తమ రచనల్లో తెలుగును మంచిగానే వాడినారు.
అన్నమయ్య కీర్తనల్లో రాయలసీమ తెలుగును బాగా చూడవచ్చు. ఆదిభట్ల నారాయణదాసు, మారేపల్లి రామచంద్రశాస్త్రి లాంటివారు సంస్కృతంలో ఉన్న అధ్యాత్మిక సంపదను తెలుగులోకి మార్చారు.
ఇవేకాక మన జానపదాలు అంతా పోతపోసిన తెలుగు. ఇదంతా కూడా మేలిమి సాహిత్యమే.
మన మేలిమి తెలుగు గ్రంధాలయంలో తెలుగు పుస్తకాలు బాగానే ఉన్నాయి. మీకు నచ్చిన పుస్తకం కోసం మేలిమి తెలుగు గ్రంధాలయం చూడండి.
సవ్వడి
భాషలాగే సంస్కృతి కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. ఆ మార్పును ఆపలేము, ఆపకూడదు కూడా. ఎటొచ్చీ సంస్కృతిని మర్చిపోకుండా ఉండే ప్రయత్నమే మనం చేయగలం. ఆ భగీరధ ప్రయత్నాన్ని భుజాల మీద వేసుకొన్న అరుదైన వ్యక్తులు కొందరు కనిపిస్తారు. శ్రీ బద్రి కూర్మారావు గారు, శ్రీ స వెం రమేశ్ లాంటి వారు అలాంటి కోవకే చెందుతారు.
క్రింది వీడియోలను చూడండి -
- తెలుగు నెరవు — యూట్యూబ్ ఛానెల్ — తెలుగు భాష, సంస్కృతి గురించి చర్చలు
- తెలుగు నడక — వీడియో జాబితా — తెలుగు సంప్రదాయాల మీద వీడియో శ్రేణి
క్రింది వెబ్సైట్లను కూడా చూడండి -
- తెలుగు నడక — తెలుగు భాష, వారసత్వం గురించిన వనరులు
- తెలుగు నెరవు — తెలుగు సంస్కృతి గురించిన వ్యాసాలు