ఒక నుడిలో క్రొత్త పలుకులు చేరుతూ ఉండాలి, అలా చేరడం వల్ల ఆ నుడి పెంపొందుతుంది. ఇది నుడికి ఎంతో మంచిది. కానీ, ఇక్కడ ఆ క్రొత్త పలుకులు నుడిలోంచే పుట్టాలి. పెరనుడి పలుకులను అలాగే దింపుకోవడం ఒక నుడికి ఎప్పుడూ చేటు. తెలుగు వరకూ వస్తే, సొంత పలుకులు ఉన్నచోట కూడా పెరనుడి పలుకులు దింపుకోవడం జరిగింది. నొప్పించే నిక్కమేంటంటే ఇయ్యాల వాడుకలో ఉన్న తెలుగంతా పరాయి నుడి పలుకులే.
వాడుకా ? తెలుగా ?
తెలుగు నుడి నేర్పించాలన్నా, నేర్చుకోవాలన్నా ఎదురయ్యే మొదటి చిక్కు ఇది. వాడుక కావాలంటే తెలుగు వదిలెయ్యాలి. తెలుగు కావాలంటే వాడుక వదిలెయ్యాలి. అయితే ఎన్నో ఏళ్ళగా తెలుగులోకి చొచ్చుకుపోయిన పలుకుల వల్ల, ఇది చెప్పినంత తేలిక పని అయితే కాదు.
మేలిమి తెలుగు పలుకులు అని చెప్పడానికి మేము ఎన్నుకొన్న వరుస -
తెలుగు పలుకులు వాడుకలో ఉంటే ముందు అవే వాడాలి.
ఒక తెలుగు పలుకు ఉండి, వాడుకలో తెలుగులోకి మారిన పెరనుడి పలుకు ఉంటే, ఆ తెలుగు పలుకు రాసి పక్కనే నెలవంకల్లో వాడుకలో ఉన్న మారిన పెరనుడి పలుకు రాయాలి. మచ్చుకు: మాపు (రేయి)
ఒక తెలుగు పలుకు ఉండి, వాడుకలో పెరనుడి పలుకు నేరుగా వాడుతూ ఉంటే, ఆ తెలుగు పలుకు రాసి పక్కనే నెలవంకల్లో వాడుకలో ఉన్న పెరనుడి పలుకు రాయాలి. మచ్చుకు: కారు (ఋతువు)
తెలుగు పలుకే లేని చోట, స.వెం. రమేశ్, వాచస్పతి లాంటివారు పుట్టిస్తున్న తెలుగు పలుకులు రాసి, పక్కనే నెలవంకల్లో వాడుకలో ఉన్న పెరనుడి పలుకు రాయాలి. అయితే ఇక్కడ ఆ పలుకుల పుట్టెరుకలు కానీ విడబరుపులు కానీ తెలిసి ఉంటేనే వాడాలి.
ఇవేవీ కుదరని చోట వాడుకలో ఉన్న పెరనుడి పలుకులు అలాగే రాయాలి.
ఇలా చేయడం వల్ల మేలు ఏంటంటే, వాడుక తెలుగు నుంచి, తెలుగు వాడుక చేయడం వైపు అడుగులు వేస్తాం.